india: టీమిండియాకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. భారీ టార్గెట్
- 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
- తొలి వికెట్ కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఫించ్, ఖవాజా
- మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
రాంచీలో భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఫించ్, ఖవాజాలు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఇద్దరూ కలసి తొలి వికెట్ కు ఏకంగా 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్ ఫించ్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 99 బంతుల్లో 93 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసిన ఫించ్... చివరకు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం సెంచరీ చేసిన మరో ఓపెనర్ ఖవాజాను షమీ పెవిలియన్ చేర్చాడు. 113 బంతులను ఎదుర్కొన్న ఖవాజా 11 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 104 పరుగులు చేశాడు.
ఆ తర్వాత మ్యాక్స్ వెల్ (47), షాన్ మార్ష్ (7), హ్యాండ్స్ కోంబ్ (0)లు పెవిలియన్ చేరారు. స్టోయినిస్ 31, కేరీ 21లు నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్ కూల్చాడు. మ్యాక్స్ వెల్ రనౌట్ గా వెనుదిరిగాడు. 314 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా కాసేపట్లో బ్యాటింగ్ ను ప్రారంభించనుంది.