Rahul Gandhi: రాఫెల్ పత్రాలు చోరీకి గురికాలేదు... మాట మార్చిన మోదీ సర్కారు!
- కోర్టుకు వెల్లడించిన ఏజీ
- నష్టనివారణకు ప్రయత్నం
- సుప్రీంలో పొంతనలేని వాదనలు!
రాఫెల్ విమానాల ఒప్పందం దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలకపత్రాలు చోరీకి గురయ్యాయని పేర్కొన్న కేంద్రం అంతలోనే మాటమార్చడం అందరిలోనూ సందేహాలు రేకెత్తిస్తోంది.
అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ శుక్రవారం మాట్లాడుతూ రాఫెల్ పత్రాలు చోరీకి గురికాలేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పిటిషనర్ రాఫెల్ పత్రాల ఒరిజినల్స్ తీసుకెళ్లి ఫొటోకాపీలు తీసుకున్నారని చెప్పడమే తన ఉద్దేశం అంటూ గత వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు విఫలయత్నం చేశారు. అంతకుముందు ఆయన సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని బాంబు పేల్చారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రధాని మోదీపై ప్రత్యక్ష ఆరోపణలకు దిగింది. "రూ.30,000 కోట్ల స్కాంలో ప్రధాని పాత్ర ఉందనడానికి ఇదే రుజువు, పత్రాలు పోయాయి అని చెప్పడంలోనే ప్రధానికీ ఇందులో ప్రయేయం ఉందన్న విషయం స్పష్టమవుతోంది" అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయిన కేంద్రం ఏజీతో తాజాగా పత్రాలు ఉన్నాయంటూ మరో ప్రకటన చేయించింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుంటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.