BJP: గుజరాత్లో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒకరు బీజేపీలో చేరిక
- బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన మరో ఎమ్మెల్యే
- ఇరిగేషన్ స్కాంలో అరెస్టై ఇటీవల బెయిలుపై విడుదలైన ఎమ్మెల్యే
- కేసుకు, బీజేపీలో చేరికకు సంబంధం లేదన్న ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిలో ఒకరు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, మరొకరు కూడా అదే దారిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది.
మనవదార్ ఎమ్మెల్యే జవహర్ చవ్డా తన రాజీనామా లేఖను శుక్రవారం మధ్యాహ్నం స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి అందించారు. ధ్రంగధర కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్షోతమ్ సబారియా సాయంత్రం పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే చవ్డా గాంధీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాను కూడా కాషాయపార్టీలో చేరబోతున్నట్టు సబారియా కూడా ప్రకటించారు. ఇరిగేషన్ కుంభకోణం కేసులో సబారియా గతేడాది అక్టోబరులో అరెస్టయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిలుపై విడుదలయ్యారు. బీజేపీలో చేరిక వెనక తనపై ఎటువంటి ఒత్తిడి లేదని, పెండింగ్ కేసుకు, బీజేపీలో చేరికకు సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. స్వచ్ఛందంగానే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. బీజేపీ తనకు మంత్రి పదవి ఆఫర్ చేయలేదని స్పష్టం చేశారు.