Congress: మోదీని ముక్కలుగా కోస్తానన్న వ్యక్తికి మళ్లీ టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్!
- యూపీని గుజరాత్‌లా చేయాలనుకుంటున్న మోదీని ముక్కలు చేస్తానన్న మసూద్
- గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి
- మళ్లీ అతడికే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్రమోదీని ముక్కలుగా కోస్తానన్న ఇమ్రాన్ మసూద్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ నుంచి బరిలోకి దింపనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో మసూద్ పేరును చేర్చింది.
గురువారం కాంగ్రెస్ విడుదల చేసిన తొలి విడత జాబితాలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా మొత్తం 15 మంది పేర్లు ఉన్నాయి. సోనియా రాయ్‌బరేలీ నుంచి పోటీపడనుండగా, రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ప్రియాంక స్థానంలో ఇమ్రాన్ మసూద్ పేరును ప్రకటించడం వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘గుజరాత్లో నాలుగు శాతం మాత్రమే ముస్లింలు ఉన్నారు. ఇక్కడ (యూపీలో) 42 శాతం ముస్లింలు ఉన్నారు. అతడు (మోదీ) యూపీని గుజరాత్‌లా చేయాలని భావిస్తున్నాడు. అలాంటి ఆలోచనలు మానుకోకుంటే అతడిని (మోదీని) ముక్కలు ముక్కలుగా కోస్తా’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీపై చేసిన ఈ వ్యాఖ్యల ఫలితంగా మార్చి 2014లో అరెస్టై జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిలుపై బయటకొచ్చి కాంగ్రెస్ టికెట్‌పై షహరాన్‌పూర్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పట్లో మసూద్ వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. అయితే, 2015లో షహరాన్‌పూర్‌లో రాహుల్ నిర్వహించిన పాదయాత్రలో ఇమ్రాన్ ఆయన పక్కనే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మసూద్‌ను ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.