team India: గతంలో ఎప్పుడూ జరగని వింత.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లీ సేన విచిత్రం
- మూడు వన్డేల్లోనూ భారత్ ఆడింది 48.2 ఓవర్ల వరకే
- మూడు మ్యాచుల్లో రెండింటిలో గెలుపు
- సిరీస్‌లో 2-1తో ఆధిక్యం
ఆస్ట్రేలియాతో ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. తాజాగా, శుక్రవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సేన పోరాడి ఓడింది. ఆసీస్ నిర్దేశించిన 314 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 48.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌట్ అయింది. కోహ్లీ సెంచరీ జట్టును గెలిపించలేకపోయింది. అయితే, ఒకానొక దశలో వంద పరుగుల్లోపే భారత్ కుప్పకూలుతుందనుకున్న దశ నుంచి కోలుకుని పోరాడిన తీరుకు అభిమానులు సైతం ఫిదా అయ్యారు.
అయితే, ఈ సిరీస్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లోనూ భారత్ 48.2 ఓవర్లు మాత్రమే ఆడడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 236/7 చేయగా, భారత్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక నిన్నటి మ్యాచ్‌లోనూ సరిగ్గా అన్నే ఓవర్ల వద్ద భారత్ ఆలౌట్ అయింది. ఇది యాదృచ్ఛికమే అయినా మూడు వన్డేల్లోనూ సరిగ్గా అనే ఓవర్లను ఆడడం మాత్రం విచిత్రమే.