Andhra Pradesh: దమ్ముంటే చంద్రబాబు భీమిలి నుంచి పోటీచేయాలి.. ఎవరొచ్చినా సీటు మాదే!: అవంతి శ్రీనివాస్
- ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
- టీడీపీ హయాంలో ఓ వర్గానికే లాభం జరిగింది
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సురక్షితమైన నియోజకవర్గాన్ని చూసుకుని కొడుకు లోకేశ్ ను భీమిలికి పంపుతున్నారని వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. దమ్ముంటే చంద్రబాబు భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు లేదా లోకేశ్ ఎవరు పోటీచేసినా గెలిచేది వైసీపీనేనని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అవంతి శ్రీనివాస్ ఈరోజు మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రజలు 3 సార్లు అవకాశమిచ్చినా చంద్రబాబు మాత్రం తాను అయోమయానికి గురవుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ హయాంలో ఓ సామాజికవర్గానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.
2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ను తిట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు బీజేపీని తిడుతూ కాంగ్రెస్ తో జతకడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మొదటినుంచి వైసీపీనే పోరాడుతోందని గుర్తుచేశారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.