KTR: నిజం దాచేస్తే దాగదు... వాస్తవంగా పోటీ హరీశ్, కేటీఆర్‌ల మధ్యే!: టీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
- ఆ విషయం ప్రజలకు కూడా తెలుసు
- మళ్లీ అధికారం సాధిస్తాం...మోదీ ప్రధాని అవుతారు
- కేటీఆర్‌కు సవాల్ విసిరిన లక్ష్మణ్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్, బీజేపీతో కాదని కేటీఆర్ అనడంలో వాస్తవం ఉందని, భవిష్యత్తులో పోటీ హరీశ్‌రావు, కేటీఆర్‌ల మధ్యే అన్నది ప్రజందరికీ తెలిసిన విషయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.
ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఓ సభలో కేటీఅర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాజకీయంగా ఆధిపత్యం కోసం హరీశ్‌రావుతో తాను పోటీపడుతున్న విషయాన్ని కేటీఆర్ చెప్పకనే చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఎన్డీయే సొంతంగా మెజార్టీ సాధిస్తుందని, మళ్లీ కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
మీరు గొప్పగా చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్‌లో ఉన్న పార్టీలు ఏవో, ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని లక్ష్మణ్ కోరారు. రాష్ట్రాల మధ్య నీటి వివాదాలతోపాటు మిగిలిన అంశాలపై మీ విధానం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కొద్ది కాలంలోనే బీడీ కట్టల మీద పుర్రెగుర్తు తెచ్చి కార్మికుల జీవితాలను బుగ్గిపాలు చేసిన ఘనత కేసీఆర్‌దని విమర్శించారు.