Andhra Pradesh: ఇది 'మల్టీ విలన్' సినిమా.. ఇందులో జగన్, మోదీ, కేసీఆర్, అమిత్ షా అందరూ ఉన్నారు!: సీఎం చంద్రబాబు
- తెలంగాణ పోలీసులు అతిగా ప్రవర్తించారు
- విజయసాయి రెడ్డి డైరెక్షన్ లో డ్రామా చేస్తున్నారు
- అమరావతిలో మీడియాతో ఏపీ ముఖ్యమంత్రి
ఐటీ గ్రిడ్స్ కంపెనీ విషయంలో తెలంగాణ పోలీసులు అతిగా ప్రవర్తించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో తెలంగాణ పోలీసులు డ్రామాను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఈ నెల 2న అర్ధరాత్రి 12.15 గంటలకు ఫిర్యాదును స్వీకరించారని వెల్లడించారు. ఎవరైనా అర్ధరాత్రి 12.15 గంటలకు కేసు నమోదుచేస్తారా? అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంపై అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.
హత్య, కిడ్నాప్, రేప్ జరిగితేనే అర్ధరాత్రి కేసులు నమోదుచేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వ డేటా పోయిందంటే మీరేం చేయాలి? గౌరవంగా మీ(తెలంగాణ) ఐటీ సెక్రటరీ, మా(ఆంధ్రప్రదేశ్) ఐటీ సెక్రటరికీ ఫోన్ చేయాల్సింది. అప్పుడు గౌరవంగా, మర్యాదగా ఉండేది. కానీ ఇక్కడే కుట్ర మొదలయింది. దొంగతనంగా మా డేటాను తీసుకుని తిరిగి మామీదే కేసు పెట్టారు. కేసు పెట్టి ఉద్యోగులను వేధించడం మొదలుపెట్టారు’ అని తెలిపారు. నలుగురు ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడంతో ఆ సంస్థ అధినేత అశోక్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దీంతో గత్యంతరం లేక పోలీసులు నలుగురిని తెలంగాణ హైకోర్టు ముందు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
ఈ నెల 7న తెలంగాణ ప్రభుత్వం సిట్ వేసిందని చంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 23న సోదా జరిగినట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో చెప్పాడన్నారు. ఏ అధికారంతో ఈ దాడులు నిర్వహించారని చంద్రబాబు మరోసారి ప్రశ్నించారు. ఇంత జరిగిన తర్వాత ఓ పార్టీకి చెందిన డేటాను అనుమతి లేకుండా ఎందుకు తీసుకెళ్లారని నిలదీశారు. రాజకీయ పార్టీలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
మరోసారి ప్రెస్ మీట్ లో స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23న కేవలం ప్రాథమిక విచారణ జరిపామని స్పష్టం చేశారన్నారు. బతకడానికి పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు బెదిరించారనీ, వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మల్టీ విలన్ సినిమా అనీ, విజయసాయిరెడ్డి, జగన్, కేసీఆర్, మోదీ, అమిత్ షా.. అందరూ ఇందులో ఉన్నారని వ్యాఖ్యానించారు. వీరంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.