Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి 14 రోజుల రిమాండ్.. సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు!
- కోటంరెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసిన పోలీసులు
- అధికారుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణుల ఆందోళన
- పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అనీల్ ఆగ్రహం
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదుచేసిన వేదాయపాలెం పోలీసులు ఆయన్ను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొలుత జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వ వ్యవహారశైలికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ఈ సందర్భంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. కోటంరెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. అక్రమంగా సర్వేలు చేపడుతున్న వ్యక్తులను వైసీపీ కార్యకర్తలు పట్టుకున్నారని గుర్తుచేశారు. వీరిని పోలీసులకు అప్పగించగా, వైసీపీ నేతలపైనే పోలీసులు ఎదురుకేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వేల పేరుతో వైసీపీ నేతల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేయడంపై కోటంరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని వేదాయపాలెం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేశారు.