Telangana: సొంత చెల్లికే శఠగోపం.. ఆస్తి మొత్తాన్ని కాజేసేందుకు యత్నించిన అన్న.. పోలీసులను ఆశ్రయించిన మహిళ!
- తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
- సుధకు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆస్తులు
- రహస్యంగా ఆస్తిని దక్కించుకునేందుకు సోదరుడి పన్నాగం
సొంత కుటుంబ సభ్యులను నమ్మిన ఓ వివాహిత తీవ్రంగా మోసపోయింది. అన్న ఉన్నాడులే అన్న ధైర్యంతో ఆస్తులను అప్పగించి అమెరికాకు వెళితే, ఆమె సొత్తును కాజేసేందుకు సదరు సోదరుడు చల్లగా పావులు కదిపాడు. నెలనెలా చెల్లించాల్సిన అద్దెలను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ కు చెందిన సుధామంత్రికి నగరంతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె 1990లో అమెరికా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆస్తుల వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా అన్న శ్యాంమంత్రి, వదిన మాధవీలతను కోరారు. తొలుత బాగానే ఉన్నప్పటికీ కొద్దికాలానికి సోదరి ఆస్తిని కొట్టేయాలని శ్యామ్ కు దుర్బుద్ధి పుట్టింది. దీంతో నీటి బిల్లులు, కరెంట్ బిల్లుల వంక చూపుతూ ఖాళీ పత్రాలపై సుధ సంతకాలు తీసుకున్నారు.
సోదరి అమెరికాలో ఉంటోందని చెప్పి ఆమె బ్యాంకు ఖాతాలో జమచేయాల్సిన రూ.1.32 కోట్ల అద్దెను నొక్కేశారు. హైదరాబాద్ లోని ఇంటికి తామే యజమానులమని చెప్పి మరొకరికి అమ్మేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సుధ అమెరికా నుంచి తిరిగివచ్చారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై సుధ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.