USA: విమానం గాల్లో ఉండగానే రెండు గ్రూపులుగా విడిపోయి చితక్కొట్టుకున్న ప్రయాణికులు!
- టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఘటన
- ఇస్తాంబుల్-న్యూయార్క్ ఫ్లైట్ లో ఘర్షణ
- 32 మందికి దెబ్బలు, నలుగురికి తీవ్రగాయాలు
సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడాన్ని మనం ఇప్పటివరకూ చూసిఉంటాం. తాజాగా అలాంటి ఘటన ఓ విమానంలో చోటుచేసుకుంది. విమానం నడిసముద్రంపై ఎగురుతుండగా రెండు వర్గాలుగా విడిపోయిన ప్రయాణికులు చితక్కొట్టుకున్నారు. ఈ ఘటనలో 32 మంది గాయపడగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్ సమీపంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు 320 మంది ప్రయాణికులతో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. ఇంకో గంటలో న్యూయార్క్ లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా విమానంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. దీంతో ప్రయాణికులంతా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ దాడిలో ఒక్కసారిగా ఫ్లైట్ లో హాహాకారాలు చెలరేగాయి.
ఈ నేపథ్యంలో విమానాన్ని పైలట్ న్యూయార్క్ లోని కెన్నడీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కాగా, ఈ ఘర్షణలో 32 మందికి గాయాలు కాగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి కాలు విరిగింది. దీంతో అధికారులు వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.