Andhra Pradesh: నెల్లూరు జిల్లా అధికారులకు వైసీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వార్నింగ్!
- చంద్రబాబు పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు
- వైసీపీ నేతలను భయపెట్టేందుకే ఈ చర్యలు
- ఓటమి భయంతోనే వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలీస్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలను భయపెట్టేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. ఎస్పీకి తెలియకుండానే డీఎస్పీ చెప్పినట్లుగా జిల్లా పోలీస్ యంత్రాంగం నడుచుకుంటోందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓటమి భయంతోనే బాబు వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని ప్రశ్నించినందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల్లాగా కాకుండా అధికారుల్లా వ్యవహరించాలని సూచించారు. ఈ తప్పుడు అరెస్టులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని తేల్చిచెప్పారు.
అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించే అధికారులు ఇబ్బందులు పడతారని సుతిమెత్తగా హెచ్చరించారు. కాగా, పోలీసుల కనుసన్నల్లోనే సర్వే టీమ్ వైసీపీ ఓట్లను తొలగిస్తోందని ఆ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు.