sumalatha: సుమలతకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం కుమారస్వామి
- సుమలతపై కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు
- భర్త చనిపోయి రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్న
- ఆవేశంలో అలా మాట్లాడారంటూ క్షమాపణ చెప్పిన కుమారస్వామి
ప్రముఖ సినీ నటి, కన్నడ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే, భర్త అంబరీష్ మృతి చెంది రెండు నెలలైనా కాలేదు... సుమలతకు అప్పుడే రాజకీయాలు అవసరమా? అని కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ విమర్శించారు. తన సోదరుడి వ్యాఖ్యలకు కుమారస్వామి క్షమాపణ చెప్పారు. మీడియా మిత్రులు రేవణ్ణను ఉద్రేకపరిచేలా ప్రశ్నలు అడిగారని... ఆ తరుణంలోనే ఆవేశంలో ఆయన అలా మాట్లాడారని అన్నారు. కొంచెం శాంతంగా ఆలోచించి సమాధానం చెప్పి ఉంటే... ఎవరికీ బాధ కలిగి ఉండేది కాదని అన్నారు. మహిళలను కించ పరిచే సంస్కృతి తమ కుటుంబంలో లేదని చెప్పారు.
మరోవైపు కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కూడా మండ్యాలో మీడియాతో మాట్లాడుతూ సుమలతకు క్షమాపణ చెప్పారు. మండ్యా లోక్ సభ స్థానం నుంచి నిఖిల్ జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు జేడీఎస్ ఎనలేని గౌరవం ఇస్తుందని చెప్పారు.
రేవణ్ణ వ్యాఖ్యలపై లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉందని... ఇలాంటి వ్యాఖ్యలు మంచి చేయవని చెప్పారు. అదుపు కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే... ఇవి విపక్షాలకు ప్రచార అస్త్రాలుగా మారతాయని హితవు పలికారు.