President Of India: పద్మ' అవార్డు స్వీకరించడానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ప్రభుదేవా
- పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- ప్రభుదేవాకు 'పద్మశ్రీ'
- మోహన్ లాల్ కు 'పద్మభూషణ్'
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకనటుడు ప్రభుదేవా పద్మ అవార్డు స్వీకరించాడు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పురస్కారాలు అందజేశారు. ప్రభుదేవా విషయానికొస్తే, నృత్యం, దర్శకత్వం, నటన.. ఇలా అనేక విభాగాల్లో బహుముఖ ప్రతిభ చూపిస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఆయన కృషికి గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. పద్మ పురస్కారాల కోసం ప్రభుదేవా తన తల్లిదండ్రులు మహదేవమ్మ, సుందరం మాస్టార్ లతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశాడు. తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టుతో వచ్చాడీ ఇండియన్ మైఖేల్ జాక్సన్.
కాగా, అవార్డులకు ఎంపికైన 112 మందిలో 56 మందికి సోమవారం నాడు పురస్కారాలు ప్రదానం చేశారు. ఇరువర్, వానప్రస్థం, భారతమ్... లేటెస్ట్ గా పులిమురుగన్ వంటి చిత్రాలతో శిఖరసమానమైన నటనను ప్రదర్శించిన మోహన్ లాల్ కూడా పద్మ అవార్డు అందుకున్నారు. ఆయనకు పద్మభూషణ్ ప్రదానం చేశారు. ఇప్పటికీ తరగని ఉత్సాహంతో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు మోహన్ లాల్. సినీ రంగంలో ఆయన సేవలకు గుర్తింపు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ తో గౌరవించింది. దీనిపై మోహన్ లాల్ మాట్లాడుతూ, ఈ ఘనత తన చిత్రాల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ దక్కుతుందని, తన కుటుంబ సభ్యులకూ ఇందులో భాగం ఉందని అన్నారు.