Tamil Nadu: తమిళనాడులో భారీ సెక్స్ రాకెట్.. 200 మందికి పైగా అమ్మాయిలపై అత్యాచారం.. వీడియోలు చూపించి కోట్ల సంపాదన
- ముఠాను నడిపిస్తున్న అధికారపార్టీ యువనేత
- ధనబలం, అధికార బలంతో చెలరేగిపోయిన నాగరాజ్
- తమిళనాడులో రాజకీయ దుమారం
తమిళనాడులో దిగ్భ్రాంతి కలిగించే భారీ సెక్స్ రాకెట్ ఒకటి బయటపడింది. 20 ఏళ్లలోపు కళాశాల అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని వాటిని వీడియోలు తీసి వాటితో వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చి సంచలనమైంది. 200 మందికిపైగా యువతులు, బాలికలు ఈ ముఠా బారినపడ్డారు. తాజాగా, ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఈ రాకెట్‌ను స్వయంగా అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన యువనేత దీనిని నడిపించడం.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ముఠాలోని సభ్యులు తొలుత ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత ప్రేమిస్తున్నామంటూ వెంటపడి శారీరకంగా దగ్గరవుతారు. ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారు. వారి కుటుంబ సభ్యులకు ఆ వీడియోలు చూపించి డబ్బులు వసూలు చేస్తారు. ఇలా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధిత యువతులందరూ కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందినవారే.
ఏడేళ్లుగా సాగుతున్న ఈ రాకెట్ వ్యవహారం బాధితుల ఫిర్యాదుతో బయటకొచ్చింది. ఓ కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్(25), తిరునావుక్కరసు (25) సతీశ్(28), వసంతకుమార్(27)లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్ఫోన్లలో వందలాదిమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలను చూసి నిర్ఘాంతపోయారు. రెండువందల మందికిపైగా బాధితులు ఉంటారని ఈ వీడియోల ఆధారంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.
తమ అక్కలు, చెల్లెళ్లు చదువుతున్న పాఠశాలు, కళాశాలలలోని అమ్మాయిల సెల్‌ఫోన్ నంబర్లను ముఠా సభ్యులు సేకరించి వారితో పరిచయం పెంచుకుంటారు. ధనవంతుల్లా వారిని నమ్మించి దగ్గరవుతారు. అనంతరం మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడతారు. ఆ ఘటనను రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుంటారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు విషయం తెలిసిన ముఠా సభ్యులు దానిని వెనక్కి తీసుకోకుంటే చంపేస్తామని కొందరు తనను బెదిరించినట్టు బాధిత యువతి చేసిన పిర్యాదుతో సెంథిల్(33), బాబు (26), నాగరాజ్‌ను (27) పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడైన నాగరాజ్ ధన, అంగబలంతోపాటు అధికార పార్టీ అండతో చెలరేగిపోయాడు. అంతేకాదు, అరెస్ట్ అయిన రెండు రోజుల్లోనే నాగరాజు బయటకు రావడం వివాదాస్పదమైంది. ముఠా సభ్యులైన శబరిరాజన్, తిరునావుక్కరసు, సతీశ్, వసంతకుమార్లపై గూండా చట్టం ప్రయోగించినట్టు కోయంబత్తూరు ఎస్పీ పాండ్యరాజన్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఘటన సంచలనం కావడం, ముఠా సభ్యుడు అధికారపార్టీ నేత కావడంతో రాజకీయ దుమారం రేగింది. అన్నాడీఎంకేపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో స్పందించిన అధికారపార్టీ నాగరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.