prajashanthi party: మా గుర్తు హెలికాప్టరే.. స్పష్టం చేసిన కేఏ పాల్
- సీఈసీ సునీల్ అరోరాను కలిసిన పాల్
- హెలికాప్టర్ గుర్తులో మార్పులేదని స్పష్టీకరణ
- ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏపీని అమెరికా చేస్తానని హామీ
ప్రజాశాంతి పార్టీ చిహ్నమైన హెలికాప్టర్ గుర్తు తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉందని, దానిని మార్చాలంటూ ఇటీవల వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యర్థించారు. దీంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, పార్టీ గుర్తును హోల్డ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. వైసీపీ నేతల ఫిర్యాదుపై పాల్ విరుచుకుపడ్డారు. ఫ్యాన్, హెలికాప్టర్ ఒకేలా కనిపించడం ఏంటంటూ ఎద్దేవా చేశారు.
సోమవారం ఢిల్లీ వెళ్లిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ పాల్ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి పార్టీ గుర్తుపై చర్చించారు. అనంతరం పాల్ విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ గుర్తు హెలికాప్టరేనని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా మారుస్తానన్నారు. ఫారం-7ను వైసీపీ దుర్వినియోగం చేసిందని విరుచుకుపడ్డారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కోరినట్టు పాల్ తెలిపారు.