Chandrababu: నా నిర్ణయమే ఫైనల్.. వ్యతిరేకిస్తే క్రమశిక్షణా చర్యలు: టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
- ఎంపిక కాబడని వారికి భవిష్యత్తులో అవకాశం
- టికెట్ ఇవ్వని కారణం చెప్పాలంటే చెబుతా
- నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు
అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తాను ఎలాంటి రాగద్వేషాలనూ ప్రదర్శించడం లేదని, అన్ని సమీకరణాలు, పనితీరును సమీక్షించిన తరువాతనే ఓ నిర్ణయానికి వస్తున్నానని, తాను తీసుకున్న నిర్ణయమే ఫైనలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఉండవల్లి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీల్లేదని, వ్యతిరేకిస్తే, క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎంపిక కాబడని వారికి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని, వారికి టికెట్ ఇవ్వని కారణం తెలుసుకోవాలని ఉంటే, తాను రికార్డులను ఇస్తానని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా నేతల పనితీరు, వారిపై ప్రజల్లో అభిప్రాయం, వారి సామర్థ్యం తదితరాలన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపారు. పని చేస్తున్న వారితో పాటు సామాజిక న్యాయపరంగానూ తాను ఆలోచించానని, ఓ అభ్యర్థిని ఎంపిక చేసే ముందు ప్రజాభిప్రాయం, కార్యకర్తల మనోగతం తెలుసుకున్నానని చెప్పారు.
వైసీపీలో చింతలపూడి అభ్యర్థిని పలుమార్లు మారుస్తున్నారని, తొలుత రూ. 3 కోట్లు ఇస్తానని వచ్చిన వ్యక్తి పేరు చెప్పి, ఆపై అంతకన్నా ఎక్కువ ఇస్తానంటూ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.