Baby: విమానాశ్రయంలో శిశువును మర్చిపోయి ఫ్లైటెక్కిన తల్లి.. మార్గమధ్యంలో విమానం వెనక్కి!
- సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ విమానాశ్రయంలో ఘటన
- మార్గమధ్యంలో శిశువును మర్చిపోయినట్టు గుర్తు రావడంతో తల్లి షాక్
- విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్
ప్రయాణాల్లో సాధారణంగా చిన్నపాటి బ్యాగును కూడా మర్చిపోరు. ఎందుకంటే పదేపదే అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. ఇక విమానాశ్రయాల్లో ఏదైనా బ్యాగు మర్చిపోయినా దానిని తిరిగి తీసుకోవడం తలకుమించిన పని. అది అత్యంత అవసరమైతే తప్ప దానిని తిరిగి సొంతం చేసుకోవడం కష్టం.
అయితే, ఓ తల్లి మాత్రం తన నవజాత శిశువును మర్చిపోయి ఫ్లయిటెక్కేసింది. మార్గమధ్యంలో ఏదో మర్చిపోయినట్టు అనిపించిన ఆమె అసలు విషయం గుర్తొచ్చి షాక్‌కు గురైంది. వెయింటిగ్ హాల్‌లో తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కిన విషయం గుర్తు రావడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి.
విషయం విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు. పైలట్ చెప్పిన విషయం విన్న ఏటీసీ ఆశ్చర్యపోయింది. అనంతరం విమానం వెనక్కి రావడానికి అనుమతి ఇచ్చింది. విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.
సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.