Rahul Gandhi: ఎంతటి త్యాగానికైనా సిద్ధం, దేనికీ వెనుకాడం... ఆర్ఎస్ఎస్-బీజేపీ ఓటమే లక్ష్యం: రాహుల్ గాంధీ
- అహ్మదాబాద్ లో కాంగ్రెస్ నేతల భేటీ
- గెలుస్తాం అంటూ రాహుల్ ధీమా
- శ్రేణులకు ఉత్సాహం కలిగించే ప్రయత్నం
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీ ముఖ్యనేతలతో అహ్మదాబాద్ లో సమావేశం నిర్వహించారు. మహాత్మాగాంధీ చేపట్టిన చారిత్రాత్మక దండి సత్యాగ్రహం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్టీ అగ్రనాయకత్వం ఏమని తీర్మానించిందో రాహుల్ ట్విట్టర్ లో తెలిపారు.
ఆర్ఎస్ఎస్-బీజేపీ సిద్ధాంతాలైన నిరంకుశత్వం, మతవిద్వేషం, కుట్రపూరిత రాజకీయాలను ఓడించాలని తీర్మానించామని, ఈ ప్రస్థానంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని, దేనికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో గెలిచేది తామేనని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో రాహుల్ తో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ఓ బ్లాగ్ లో కాంగ్రెస్ పార్టీపై నిశిత విమర్శలు చేశారు. గాంధేయ వాదానికి పూర్తి వ్యతిరేకంగా ఉండడమే కాంగ్రెస్ సంస్కృతి అని అభివర్ణించారు. ఈ విషయాన్ని గాంధీజీ ముందే ఊహించి 1947లో స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేసేయమని చెప్పారంటూ వ్యాఖ్యానించారు.