Cricket: ఈ టాలీవుడ్ హీరో అన్నయ్య టీమిండియా బౌలింగ్ కోచ్ అని తెలుసా?
- క్రికెట్ కు సినీ పరిశ్రమకు ఆసక్తికర లింకు
- బౌలింగ్ కోచ్ భరత్ తమ్ముడు సినీ హీరో
- దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా గుర్తింపు
భారత క్రికెట్ జట్టుకు చాలాకాలంగా బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న భరత్ అరుణ్ కు సినిమా పరిశ్రమకు ఓ లింకుంది. భరత్ అరుణ్ సోదరుడు దక్షిణాదిలో ఒకప్పుడు ప్రముఖ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ హీరో ఎవరో కాదు... ఆనంద్. తెలుగువాళ్లకు కూడా సుపరిచితుడే. సినిమాల్లోనే కాదు టెలివిజన్ సీరియళ్ల ద్వారా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దొంగ దొంగ చిత్రంలో ఆనంద్ హీరోగా నటించాడు. అమ్మాయి కాపురం, ఆంటీ, మెరుపు వంటి చిత్రాలతో మంచి నటుడిగా ఎదిగాడు. అంతేకాకుండా, అక్కా బాగున్నావా, పెళ్లాల రాజ్యం, అమ్మా.. నాన్న కావాలి వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించడం ద్వారా మహిళాభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఆనంద్.
ఆనంద్ నలుగురు అన్నదమ్ముల్లో చివరివాడు. పెద్దవాడైన రమేష్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థలో ఫైనాన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. రెండో అన్నయ్య సురేష్ ఓ కాలేజ్ లెక్చరర్ కాగా, మూడోవాడైన భరత్ అరుణ్ క్రికెటర్. భరత్ భారత జట్టు తరఫున రెండు టెస్టు మ్యాచ్ లు కూడా ఆడాడు. పేస్ బౌలింగ్ లో మంచి ప్రతిభ చూపించే భరత్ కు అదృష్టం కలిసిరాకపోవడంతో మొదట్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో రంజీ క్రికెట్ కే పరిమితం అయ్యాడు.
అయితే, క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి సన్నిహిత మిత్రుడు కావడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి వరించింది. పెద్దగా కష్టపడకుండానే బౌలింగ్ కోచ్ గా ఎంపికైనా, టీమిండియా బౌలర్లను సానబెట్టేందుకు ఎంతో కష్టపడ్డాడు భరత్ అరుణ్. ఆ శ్రమ ఫలితమే టీమిండియా బౌలింగ్ దళం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ యూనిట్ గా పేరుపొందింది. ఆనంద్, భరత్ ల తండ్రి వీఎస్ భారతి బ్రూక్ బ్యాండ్ ఇండియా సంస్థలో ఉన్నతోద్యోగి. తల్లి రాజ్యలక్ష్మి ఓ గృహిణి.