Chandrababu: చంద్రబాబు ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే
- మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారం
- తిరుపతి నుంచి ప్రారంభం
- రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు
సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. తొలి విడత ఎన్నికల్లోనే రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రచార పర్వం షురూ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 11న ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, మార్చి 16న ఎన్నికల ప్రచారానికి తెరలేపుతున్నారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది.
ఈ నెల 16న తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి తిరుపతి వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకు సేవామిత్ర బూత్ కమిటీల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. ఆ మరుసటి రోజు మార్చి 17న విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 18న ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం మార్చి 19న అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేపడతారు.