Daggubati Hitesh: దగ్గుబాటి హితేశ్ రాజకీయ రంగప్రవేశానికి అమెరికా పౌరసత్వం అడ్డంకి!
- అమెరికా పౌరుడిగా ఉన్న హితేశ్
- టికెట్ ఇస్తే ఇబ్బందులు రావచ్చన్న జగన్
- పర్చూరు సీటు తండ్రికే ఖరారు!
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల తనయుడు హితేశ్ రాజకీయ రంగప్రవేశానికి శరాఘాతం తగిలింది. పర్చూరు నుంచి తమ రాజకీయ వారసుడిగా హితేశ్ ను బరిలోకి దించాలన్న దగ్గుబాటి దంపతుల ఆశ ఈ దఫా ఎన్నికల్లో తీరేలా కనిపించడం లేదు. హితేశ్ అమెరికా పౌరుడిగా ఉండటం, ఆయన యూఎస్ సిటిజన్ షిప్ ఇంకా రద్దుకాకపోవడంతో, ఈ దఫా ఎన్నికల్లో హితేశ్ ను నిలపలేమని, దానికి బదులుగా పర్చూరు నుంచి మీరే పోటీ చేయాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావును, వైకాపా అధినేత వైఎస్ జగన్ కోరినట్టు తెలుస్తోంది. విదేశీ పౌరులుగా ఉన్న వ్యక్తులు, ఆ పౌరసత్వాన్ని వదులుకున్న తరువాతనే భారత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్చూరు సీటును వెంకటేశ్వరరావుకే ఖరారు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.