Rahul Gandhi: నన్ను 'సర్' అని కాకుండా 'రాహుల్' అంటూ పిలవగలవా?: ఓ విద్యార్థినితో రాహుల్ గాంధీ చిట్ చాట్
- చెన్నైలో యూత్ తో కలిసిపోయిన రాహుల్ గాంధీ
- విద్యార్థినుల ప్రశ్నలకు సమాధానాలు
- అబ్బాయిల కంటే అమ్మాయిలే తెలివైనవాళ్లంటూ ఛలోక్తి
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయన చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ విద్యార్థినులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. వందలమంది విద్యార్థినులు హాజరైన ఈ ప్రశ్నావళి కార్యక్రమంలో తనను కష్టమైన ప్రశ్నలే అడగాలని రాహుల్ ముందే సూచించారు. అంతేకాదు, ఓ స్టూడెంట్ తో మాట్లాడుతూ తనను రాహుల్ అని పిలవాలని కోరారు. సర్ అనాల్సిన అవసరం లేదని, రాహుల్ అని పిలిస్తే చాలని చెప్పారు.
అనంతరం ఆ విద్యార్థిని, "నేనడిగే ప్రశ్న ఏంటంటే రాహుల్" అని మొదలుపెట్టడంతో ఆడిటోరియంలో కేకలు మిన్నంటాయి. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తీవ్ర నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందా? అని ప్రశ్నించింది అజ్రా అనే ఆ విద్యార్థిని. అందుకు రాహుల్ గాంధీ బదులిస్తూ, భారత్ లో విద్యపై తక్కువస్థాయిలోనే నిధులు ఖర్చవుతున్నాయని, కానీ మన లక్ష్యం 6 శాతం అని తెలిపారు. అయితే, విద్యపై నిధుల వ్యయం గురించి కాకుండా విద్యా స్వేచ్ఛ గురించి కూడా ఆలోచించాలని అన్నారు.
ఇక, మహిళా సాధికారత గురించి మరో స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, 2019లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తున్నామని, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు పొందుతారని వివరించారు. ఆ జవాబుకు ముక్తాయింపుగా, అయినా పురుషుల కంటే మహిళలే తెలివైనవాళ్లు అంటూ ఛలోక్తి విసిరారు. దాంతో మరోసారి అక్కడ చప్పట్లతో మార్మోగిపోయింది. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి ఎంతో ట్రెండీగా విచ్చేశారు. సాధారణంగా వేసుకునే కుర్తా, జాకెట్ కు బదులు గ్రే టీ షర్ట్, జీన్స్ తో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.