East Godavari District: మాగోడు పట్టని మీకెందుకు ఓటెయ్యాలి?: తూ.గో.జిల్లాలో ఓ కాలనీ వాసుల వినూత్న నిరసన
- తమ ఓట్లు అడగవద్దంటూ రాజకీయ పార్టీలకు హుకుం
- 35 ఏళ్లయినా కనీస సౌకర్యాల్లేవని ఆవేదన
- తమ ఆవేశాన్ని వెల్లడిస్తూ గ్రామం బయట ఫ్లెక్సీ ఏర్పాటు
ఎన్నికల వేళ నాయక గణాన్ని దిగివచ్చేలా చేయాలంటే ఓటుకు మించిన ఆయుధం ఏముంది? అందుకే ఆ కాలనీవాసులు ‘ఇదే మంచి తరుణం’ అనుకున్నారు. 'మూడున్నర దశాబ్దాలుగా మాగోడు పట్టని ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మా ఓటు కూడా అడగడానికి రావద్దు' అంటూ తేల్చిచెప్పేశారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలోని ముత్యాల వారి కాలనీ (ప్రభుత్వ గృహ సముదాయం) వారు ఈ విధంగా వినూత్నరీతిలో తమ నిరసన తెలియజేస్తున్నారు.
తమ కాలనీ ఏర్పాటై 35 సంవత్సరాలైందని, ఇప్పటికీ కనీస వసతులైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా తమ సమస్యను అర్థం చేసుకోలేదని, అటువంటప్పుడు తాము ఓటువేసి ఏం ప్రయోజనం? అని అడుగుతున్నారు. తమ నిరసనను తెలియజేస్తూ గ్రామం బయట ఓ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు.
‘రాజకీయ పార్టీలు మా ఓటు అడిగేందుకు మా కాలనీకి రావద్దు. మా విలువైన కాలాన్ని వృథా చేయవద్దు’ అంటూ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంతేకాదండోయ్...కాలనీలోని రోడ్ల దుస్థితి, కాలువల పరిస్థితికి సజీవ సాక్ష్యాల్లాంటి కొన్ని చిత్రాలను కూడా ఆ ఫ్లెక్సీపై ముద్రించారు. చివర్లో కాలనీవాసులు దాదాపు 70 మంది సంతకాలు చేశారు.