Virat Kohli: ఓడిపోయినా మేలే జరిగింది... వరల్డ్ కప్ టీమ్ ఇది కాదు: విరాట్ కోహ్లీ
- కోహ్లీ కెప్టెన్సీలో మూడు వరుస పరాజయాలు
- ఓటమితో కుంగిపోలేదన్న కోహ్లీ
- వరల్డ్ కప్ కు ఎవరూ ఫేవరెట్లు కాదు: కోహ్లీ
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా మూడు వన్డే మ్యాచ్ లను, స్వదేశంలో సిరీస్ ను ఓడిపోవడం ఇదే తొలిసారి. నిన్న న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఉస్మాన్ ఖావాజా అద్భుతంగా రాణించడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ఈ ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ, ఓటమి తమను కుంగిపోయేలా చేయలేదని, వరల్డ్ కప్ కు వెళ్లే పూర్తి స్థాయి టీమ్ ఇది కాదని అన్నాడు.
"గత కొన్ని నెలలుగా కాంబినేషన్ ను పరిశీలిస్తూ వచ్చాం. ప్రపంచకప్ ఆడేది ఎవరో మాకు తెలుసు. పరిస్థితులను బట్టి ఆటగాళ్లు మారుతుంటారు. హార్దిక్ పాండ్యా వస్తే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ ఆప్షన్లు మెరుగుపడతాయి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఓటమి కూడా మంచిదే. కొత్త పాఠాలను నేర్పుతుంది" అన్నాడు.
ఊహించిన దానికన్నా అదనంగా 20 పరుగులు ఇచ్చినా టార్గెట్ ను అందుకోగలమని భావించామని, అయితే, స్వదేశంలో ఓటమి పాలైన ఆసీస్, భావోద్వేగంతో, ఆకలిగొన్న పులిలా ఆడిందని, ఆ జట్టుకు గెలిచే అర్హత ఉందని అన్నాడు. భారత ఓటమికి తానేమీ సాకులు చెప్పదల్చుకోలేదని కోహ్లీ అన్నాడు. చివరి మూడు వన్డేల్లో ప్రయోగాలు చేయాలని చూశామని, అయితే, ఆ మార్పులు కూడా ఓటమికి కారణం కాదని అభిప్రాయపడ్డాడు. ఈ వరల్డ్ కప్ లో ఎవరూ ఫేవరెట్లు కాదని, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు చాలా బలంగా ఉన్నాయని, ఆస్ట్రేలియా కూడా సమతూకంతో ఉందని, తమదైన రోజున పాకిస్థాన్ ఎవరినైనా ఓడిస్తుందని అభిప్రాయపడ్డాడు.