YS Viveka: ఆనాడు షాకిచ్చిన టీడీపీ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి!
- కడప జిల్లాలో ఓటమెరుగని వైఎస్ ఫ్యామిలీ
- టీడీపీ పెట్టిన 34 సంవత్సరాల తరువాత గెలుపు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాకు షాక్
- 2017లో గెలుపొందిన బీటెక్ రవి
కడప జిల్లాలో ఓటమెరుగని నేతగా వైఎస్ వివేకానందరెడ్డికి పేరున్నా, ఆయన కూడా ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయారు. అందులో ఒకటి తన వదిన విజయమ్మపైనే. ఈ ఓటమిని పక్కనుంచితే, మూడున్నర దశాబ్దాల తరువాత, 2017లో వివేకాకు, అంతకుమించి వైఎస్ కుటుంబానికి ఘోర పరాభవం టీడీపీ నుంచి ఎదురైంది. కడప జిల్లాలో తమకు ఎదురులేదని చెప్పుకునే వైఎస్ ఫ్యామిలీ, రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది.
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా ఎన్నికల్లో వివేకా స్వయంగా పోటీలో నిలిచినా ఫలితం లభించలేదు. ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ, వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆయన్ను ఓడించింది. వివేకాపై బీటెక్ రవి గెలుపొందారు. దీంతో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 34 సంవత్సరాల తరువాత వైఎస్ ఫ్యామిలీలోని సభ్యుడిని ఓడించినట్లయింది.