Andhra Pradesh: ఈసారి ఆ తప్పు చేయొద్దు.. ఏపీని అంధకారంలోకి నెట్టవద్దు!: ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

  • అందరి అభిప్రాయాలు తీసుకుని టికెట్లు ఇచ్చాం
  • సుదీర్ఘ కసరత్తు తర్వాత గెలుపుగుర్రాలను ఎంపికచేశాం
  • ఆ పదేళ్లు రాష్ట్రంలో అరాచకం నెలకొంది
టీడీపీలో అందరి అభిప్రాయాలను సేకరించి ఈసారి అభ్యర్థులను ప్రకటించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలాంటి ప్రక్రియ జరగడం చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత గెలుపు గుర్రాలను ఎంపిక చేశామన్నారు. రాగద్వేషాలకు అతీతంగా, కార్యకర్తలు, నేతల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

టికెట్ రాని నేతలు నిరాశ చెందవద్దని చంద్రబాబు ఓదార్చారు. వారందరికీ న్యాయం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన అభ్యర్థులను టీడీపీ కార్యకర్తలు ఆశీర్వదించాలని కోరారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేశామని ఏపీ సీఎం గుర్తుచేశారు.

టీడీపీని స్థాపించి 37 సంవత్సరాలు కాగా, అందులో 22 సంవత్సరాలు మనమే అధికారంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారానికి దూరంగా ఉన్న పదేళ్లు ఏపీలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈసారి మరో పార్టీకి ఓటేసి తప్పు చేయొద్దనీ, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
teleconference

More Telugu News