mumbai: ఇన్నేళ్లకు మళ్లీ ముంబయి వాసుల నోట ఉగ్రవాది కసబ్ మాట!
- ఫుట్ఓవర్ వంతెన కూలడంతో అతని ప్రస్తావన
- అప్పట్లో ఈ బ్రిడ్జినే వాడుకున్న ఉగ్ర బృందం
- అప్పటి నుంచి దీనికి కసబ్ వంతెనగా పేరు
2008 నవంబరు 26న ముంబయిలో జరిగిన ఉగ్రవాదుల మారణహోమం గుర్తుందా? పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ బృందం మారణహోమం సృష్టించింది. వీరి దాడుల్లో అప్పట్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో పోలీసులకు చిక్కిన ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ ను ఉరితీసే వరకు అతని పేరుమారుమోగింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు మహానగరంలో కసబ్ పేరు మారుమోగుతోంది. ఎందుకంటే నిన్న రాత్రి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద ఓ ఫుట్ఓవర్ వంతెన కూలిపోయి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే వంతెనపై ఆరోజు కసబ్ బృందం కూడా ప్రయాణించి హల్చల్ చేసింది.
ఛత్రపతి శివాజీ టెర్మినస్ ప్లాట్ఫామ్-1 ఉత్తర భాగాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ సమీపంలోని బీటీ లేన్తో ఈ బ్రిడ్జి అనుసంధానం చేస్తుంది. దాడుల సమయంలో అజ్మల్ కసబ్ సహా ఉగ్రవాదులు ఈ బ్రిడ్జిని వాడుకోవడంతో కొన్నేళ్లుగా దీన్ని ‘కసబ్ బ్రిడ్జి’ అని పిలుస్తున్నారు. 2008 నవంబర్ 26న కసబ్, ఇతర ఉగ్రవాదులను ఫోటో జర్నలిస్టు సెబాస్టియన్ డిసౌజా ఇదే బ్రిడ్జిపై ఫోటోలు తీశారు. కసబ్ ఏకే47తో స్పష్టంగా కనిపిస్తున్న ఫోటో సెబాస్టియన్కు అంతర్జాతీయ ప్రెస్ ఫోటో అవార్డు తెచ్చిపెట్టింది.