VVpats: వీవీప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
- ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం
- వివరణ ఇవ్వాలంటూ ఈసీకి నోటీసులు జారీ
- తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా
వీవీ ప్యాట్లను కూడా లెక్కించాలంటూ విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50 శాతం వీవీప్యాట్లను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చేలా నిబంధన తీసుకురావాలని 23 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్, సతీష్ చంద్ర మిశ్రాల నేతృత్వంలోని 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లవాసాలను కలిసి దీనిపై వినతిపత్రం అందజేశారు.
ఈసీ నుంచి సంతృప్తికర స్పందన లేకపోవడంతో వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కోర్టుకు వివరాలు అందించేందుకు ఓ సీనియర్ అధికారిని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి ఈసీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.