ys vijayamma: ఎంపీ సీటు విషయంలో వైయస్ వివేకానందరెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డిల మధ్య గొడవలు ఉన్నాయి: మంత్రి ఆదినారాయణరెడ్డి
- వైయస్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి
- గతంలో విజయమ్మపై వివేకా పోటీ చేశారు
- తాము కుట్రలకు పాల్పడ్డామని వైసీపీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది
కడప వైసీపీ ఎంపీ టికెట్ విషయంలో వైయస్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ వివేకానందరెడ్డి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పారు. గతంలో విజయమ్మ పైన కూడా వివేకానందరెడ్డి పోటీ చేశారని గుర్తు చేశారు. తొలుత గుండెపోటుతో చనిపోయారని చెప్పారని... ఆ తర్వాత మాట మార్చి విమర్శలు చేస్తున్నారని అన్నారు.
సీట్ల పంచాయతీలో తాము ఉంటే... తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో వైసీపీని ఎదుర్కోలేక తాను, చంద్రబాబు, లోకేష్, సతీష్ రెడ్డి కుట్రలకు పాల్పడ్డామని ఆరోపిస్తున్నారని అన్నారు. ఫ్యాక్షన్ వద్దని రాజీపడి, ప్రశాంతంగా ఉన్న తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కోడికత్తి కేసులో కూడా తనపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. కోడికత్తికి, తనకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వివేకానందరెడ్డి ఆవేదనతో ఉన్నారని ఆదినారాయణరెడ్డి చెప్పారు. వివేకా మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చెప్పారు. వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టుగానే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు.