shraddha kapoor: సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి తప్పుకున్న శ్రద్ధా కపూర్
- బాలీవుడ్లో సైనా నెహ్వాల్ బయోపిక్
- బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకున్న శ్రద్ధా కపూర్
- రంగంలోకి పరిణీతి చోప్రా
బాలీవుడ్లో బయోపిక్ ల జోరు కొనసాగుతూనే వుంది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కి కూడా రంగం సిద్ధమైపోయింది. ఈ పాత్రను పోషించడానికి శ్రద్ధా కపూర్ రంగంలోకి దిగింది. సైనా నెహ్వాల్ పాత్రలో ఒదిగిపోవాలనే ఉద్దేశంతో, బ్యాడ్మింటన్ లో శిక్షణ కూడా తీసుకుంది. అలాంటి శ్రద్ధా కపూర్ తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
శ్రద్ధా కపూర్ ఇచ్చిన డేట్స్ లో కాకుండా ఈ సినిమా కాస్త ఆలస్యంగా మొదలవుతోంది. దాంతో ఆల్రెడీ శ్రద్ధా కపూర్ కమిటైన ఇతర ప్రాజెక్టుల నుంచి ఆమెపై వత్తిడి పెరుగుతూ వస్తోందట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడమే మంచిదని భావించి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందట. దర్శక నిర్మాతలకు తన పరిస్థితిని వివరించి, పరస్పర అంగీకారంతోనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రాతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.