Jagan: ఎన్నికల్లో లబ్ధి కోసమే షర్మిలతో పాతకేసును మళ్లీ పెట్టించారు.. జగన్ ఏ రంగంలో అడుగుపెడితే అది నాశనమే: చంద్రబాబు

  • నేరమయ, అవినీతిమయ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి
  • వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల ముసుగు తొలగిస్తాం
  • అడ్డదార్లు, చెడ్డదార్లు జగన్‌కు పరిపాటి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో  వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మరోమారు ప్రస్తావించారు. వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీకాకుళం వెళ్తున్నట్టు చెప్పిన బాబు అక్కడి నుంచే ప్రజల్లోకి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శమన్నారు. టీడీపీకి ఉన్న ప్రజాదరణను చూడలేక వైసీపీ నేతలు కళ్లు కుట్టుకుంటున్నారన్నారు.

వివేకానంద రెడ్డి రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య వారి ఊళ్లోనే, వారింట్లోనే జరిగిందని, దీనికి టీడీపీని నిందించడం ఏంటని ప్రశ్నించారు. వీళ్లకసలు మానవత్వమే లేదన్నారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్‌కు ఉన్న దురలవాటని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. వ్యాపారంలో, రాజకీయంలో జగన్ అడ్డదార్లు, చెడుదార్లు తొక్కుతున్నాడని అన్నారు.

జగన్ ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగం అప్రతిష్ట పాలవుతోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే కోడికత్తి కేసును తీసుకొచ్చారని, ఎన్నికల కోసమే షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని ఆరోపించారు. అనీతిమయ, నేరమయ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, వైసీపీలు చేతులు కలిపాయని ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలికి తీసి ప్రజల ముందు పెడతామన్నారు.

ఈ విషయంలో దోషులు ఎవరు? ఎంతమంది ఉన్నారు? అర్ధరాత్రి, తెల్లవారుజామున ఏం జరిగింది? బెడ్‌రూం, బాత్రూంలలో రక్తపు మరకలు కడిగింది ఎవరు? గుండెనొప్పి, వాంతుల నాటకం ఆడిందెవరు? పంచనామా కాకుండా ఆసుపత్రికి ఎవరు తీసుకెళ్లారు? బట్టలు ఎవరు మార్చారు? మృతదేహాన్ని బెడ్‌రూంలోకి ఎందుకు మార్చారు? వంటివన్నీ త్వరలోనే తేలుతాయన్నారు. వివేకాను చంపడం వల్ల ఎవరికి లాభం? వంటివన్నీ దర్యాప్తులో తేలుతాయని చంద్రబాబు వివరించారు. వివేకా హత్య కేసు దోషులను పట్టుకుంటామని, సూత్రధారుల, పాత్రధారుల ముసుగు తొలగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News