Visakhapatnam District: ఏఓబీ పరిసరాల్లో ఎదురు కాల్పులు...అర్ధరాత్రి విశాఖ మన్యంలో కలకలం
- ఇద్దరు మావోయిస్టుల మృతి
- మరికొందరికి గాయాలు
- రెండు నాటు తుపాకులు స్వాధీనం
గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో శుక్రవారం రాత్రి మళ్లీ అలజడి రేగింది. జిల్లాలోని పెదబయలు మండలం పెద్దకోడాపల్లి సమీపంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు చనిపోగా, మరికొందరు గాయపడి పారిపోయినట్లు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల నుంచి పోలీసులు రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కూంబింగ్‌లో ఉన్న గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులకు దాదాపు 20 మంది మావోయిస్టులు తారసపడ్డారు.
పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులకు దిగారు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాను కాలిలోకి బుల్లెట్ వెళ్లింది. మావోయిస్టులకు పెదబయలు ఏరియా కమిటీ సుధీర్ నాయకత్వం వహించినట్లు సమాచారం.