Andhra Pradesh: ఎవరికైనా గుండెపోటు వస్తే, తల నుంచి రక్తం వస్తుందా?: చంద్రబాబు
- వివేకానందరెడ్డి హత్యపై అనేక అబద్ధాలు చెప్పారు
- వివేక తలకు కట్టు కట్టారు.. రక్తం కడిగేశారు
- శవపరీక్ష నివేదిక తర్వాత మాపై బురదజల్లడం ప్రారంభించారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అనేక అబద్ధాలు చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో జరుగుతున్న సభలో ఆయన మాట్లాడుతూ, వివేకానందరెడ్డి మొదట గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం వైసీపీ నేతలు చేశారని ఆరోపించారు. ఎవరికైనా గుండెపోటు వస్తే, తల నుంచి రక్తం వస్తుందా? అని ప్రశ్నించారు. వివేక తలకు కట్టు కట్టారని, బెడ్ రూమ్, బాత్రూమ్ లో రక్తం కడిగేశారని, హత్య జరిగాక రక్తం మరకలు ఎందుకు కడిగారని ప్రశ్నించారు.
గుండెపోటు కాదు, హత్య జరిగిందని శవపరీక్ష నివేదిక స్పష్టం చేసిందని, ఇక, అక్కడి నుంచి వైసీపీ నేతలు తమపై బురదజల్లడం ప్రారంభించారని ఆరోపించారు. వివేక హత్యకు సంబంధించిన సాక్ష్యాలు ఎందుకు ధ్వంసం చేశారు? ‘చిన్నాన్న’ అనే మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించారని జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో దోషులను కాపాడేందుకు అనేక నాటకాలు ఆడారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. వివేక హత్య విషయం తెలిసిన రోజు సాయంత్రానికి ఆయనే ఓ లేఖ రాసినట్టు సృష్టించారని, ఇదే, పులివెందుల రాజకీయం, ఇలాంటివి ఎక్కడా ఉండవని విమర్శించారు.
కేంద్రంలో మోదీ ఉన్నారన్న ధైర్యంతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు అడుగుతున్నారని, వివేకానందరెడ్డిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.