Lok Sabha: పార్లమెంట్ ఎన్నికలు.. తెలంగాణ నుంచి ‘జనసేన’ తొలి అభ్యర్థి ప్రకటన
- మల్కాజ్ గిరి నుంచి మహేందర్ రెడ్డి పేరు ప్రకటన
- సమాజ సేవ చేయాలన్న తపన ఆయనలో ఉంది
- మహేందర్ రెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తున్నా
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి జనసేన పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ‘జనసేన’ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త బొంగునూరి మహేందర్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయాలన్న తపనతో తన కోట్లాది రూపాయల వ్యాపారాలను మహేందర్ రెడ్డి వదులుకుని తన వెంటే ఉన్నారని ప్రశంసించారు. నాడు ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించక ముందు నుంచి తనతో కలిసి పనిచేశారని, నాడు మెదక్ పార్లమెంట్ స్థానానికి పీఆర్పీ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు.
అయితే, ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన మహేందర్ రెడ్డి నాడు తన నామినేషన్ సమర్పించలేకపోయారని, ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఆయన్ని మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా పంపిస్తున్నామని అన్నారు. మహేందర్ రెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తున్నానని, ఆయన విజయం కోసం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు పాటుపడాలని పిలుపు నిచ్చారు.