YSRCP: ఈ నెల 31 లోగా కొత్త ఓటర్లందరికీ ఓటరు కార్డులు పంపిణీ!: ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది
- రాయలసీమలో శాంతిభద్రతల అంశంపై సీఈవో సమీక్ష
- కడప జిల్లా ఎస్పీతో మాట్లాడిన ద్వివేది
- శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఆదేశాలు
రాయలసీమలో శాంతిభద్రతల అంశంపై ఆయా జిల్లాల ఎస్పీలతో ఏపీ ఎన్నికల సంఘం సీఈవో గోపాలకృష్ణ ద్వివేది సమీక్షించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఈ మేరకు ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోమని చెప్పినట్టు సమాచారం.
ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది
ఈ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ముగిసిందని, నిన్న ఒక్కరోజే 5 లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చినట్టు ద్వివేది తెలిపారు. నవంబరు 1 తర్వాత 37.28 లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చాయని, ఇంకా 11 లక్షల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందని అన్నారు. పత్రాలు సరిగా లేవని 3 లక్షల ఫారం-6 దరఖాస్తులు తిరస్కరించినట్టు చెప్పారు. ఈ నెల 25 లోగా పరిశీలన పూర్తి చేసి ఓటరు కార్డులు జారీ చేస్తామని, కొత్తగా 22.49 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 26న అనుబంధ ఓటర్ల జాబితా ప్రకటిస్తామని అన్నారు.
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన
ఈ నెల 31 లోగా కొత్త ఓటర్లందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన కల్పిస్తామని, ఎన్నికల విధుల్లో ఉన్న 4 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వాడుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకూ రూ.5.44 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశామని, రూ.18 లక్షల విలువైన వివిధ రకాల మత్తు పదార్థాలు పట్టుకున్నామని, మద్యం స్వాధీనం సందర్భంగా 2,077 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.