Jagan: 175 మంది అభ్యర్థులతో జాబితా రెడీ.. కాసేపట్లో విడుదల చేయనున్న జగన్!
- మొత్తం జాబితా ఒకేసారి విడుదల
- ఇడుపులపాయకు బయలుదేరిన వైఎస్ జగన్
- నేటి నుంచి ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 175 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లనూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విడతల వారీగా కాకుండా మొత్తం జాబితాను ఆయన నేడు మీడియాకు విడుదల చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 9 మందితో కూడిన లోక్ సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జగన్, మిగతా 16 మంది పేర్లను కూడా ఇవాళే విడుదల చేయనున్నారని సమాచారం.
నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్, కాసేపట్లో ఇడుపులపాయకు వెళ్లి, వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ఆపై పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఆపై కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని, మధ్యాహ్నం 12.30కి విశాఖ జిల్లా నర్సీపట్నంలో తన తొలి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఆ తరువాత మధ్యాహ్న భోజనం అనంతరం 2.30 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల పరిధిలోని డెంకాడలో, అనంతరం 4.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, అంబాజీపేటలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారు.