YSRCP: 41 మంది బీసీలకు, ఐదుగురు ముస్లింలకు టికెట్లిచ్చిన వైసీపీ!
- చాలాకాలం తరువాత బీసీలకు పెద్దపీట
- చంద్రబాబులా తప్పు లెక్కలు కట్టడం లేదు
- గతంలోకన్నా ముస్లింలకు ఓ సీటు అధికం
- వైసీపీ అధినేత వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడే మొత్తం 175 మంది అభ్యర్థుల పేర్లనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి స్మారకం వద్ద నివాళులు అర్పించిన వైఎస్ జగన్, ఆ తరువాత పార్టీ నేతలతో కలిసి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అసెంబ్లీకి పోటీచేసే వారిలో 41 మంది బీసీలున్నారు. చాలాకాలం తరువాత వెనుకబడిన తరగతుల వారికి పెద్దపీట వేసిన ఘనత వైసీపీకి దక్కిందని ధర్మాన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబునాయుడు బలిజ కులస్తులకు ఇచ్చిన టికెట్లను బీసీల జాబితాలో చేర్చారని ఆరోపించిన వైఎస్ జగన్, తమ జాబితాలోని బలిజ వర్గం నేతలను కలిపితే, బీసీలకు 45 సీట్లు ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. గతంతో పోలిస్తే ముస్లింలకు ఈ దఫా వైసీపీలో ఓ సీటు అధికంగా దక్కిందని గుర్తు చేశారు. తమ పార్టీ తరఫున ఐదుగురు ముస్లింలు పోటీ పడుతున్నారని చెప్పారు. ఈ జాబితాలోని ప్రతిఒక్కరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయం, తాము జరిపించిన సర్వేల్లో వచ్చిన అభిప్రాయాల మేరకు కొందరు సిట్టింగ్ లకు టికెట్లను ఇవ్వలేకపోయామని అన్నారు.