bjp: బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు!
- ఒకేసారి అన్ని రాష్ట్రాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
- ఏపీకి సంబంధించి లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
- యూపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఎంపీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. రాత్రి వరకు పలు రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యనేతలతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చలు జరపనున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఏపీకి సంబంధించి లోక్ సభ 18, అసెంబ్లీకి 100 మంది అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తోంది. మిగిలిన అభ్యర్థుల జాబితాపై ఏపీ నేతలతో ఈరోజు మరోసారి అమిత్ షా చర్చించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత మొత్తం జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని, ఈరోజు సాయంత్రం ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.