BJP: 'పప్పు'కు తోడుగా 'పప్పి' వచ్చింది... ప్రియాంకపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
- ఇన్నాళ్లు ఏమైపోయింది ప్రియాంక?
- విమర్శలు చేసిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి
- వైరల్ అవుతున్న వీడియో
దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల జోరు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ ప్రచారానికి తెరలేపడమే కాదు, ఘాటైన విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై విమర్శలు చేశారు. పప్పూను ప్రధానమంత్రి చేయడానికి ఇప్పుడు పప్పీ కూడా వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని సికంద్రాబాద్ లో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"పప్పూ (రాహుల్ గాంధీ) తాను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నానని చెబుతాడు. దాంతో మాయావతీ, అఖిలేష్ యాదవ్ అందరూ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు పప్పీ కూడా వచ్చింది. ప్రియాంక గాంధీ గతంలో భరతమాత పుత్రిక కాదా? కాంగ్రెస్ పార్టీకి వారసురాలు కాదా? కాంగ్రెస్ లో పదవి చేపట్టగానే ఇప్పుడు తన భారతీయత గుర్తొచ్చిందా?" అంటూ మహేష్ శర్మ మండిపడ్డారు.
అంతేకాదు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం హెచ్ డీ కుమారస్వామిపైనా విమర్శలు చేశారు. మమతా బెనర్జీ వచ్చి కథక్ ఆడినా, కుమారస్వామి వచ్చి పాట పాడినా ఎవరు చూస్తారు చెప్పండి? వీళ్లందరికంటే నరేంద్ర మోదీయే మిన్న అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.