YSRCP: వివేకా కేసులో సీఐ తప్పుదారి పట్టిస్తున్నారు!: అవినాష్ రెడ్డి ఆరోపణ
- రక్తపు మడుగులో పడి వున్నారని చెప్పా
- సీఐ వాస్తవాలను వక్రీకరించారు
- ఎస్పీకి ఫిర్యాదు చేశానన్న వైసీపీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డిని పులివెందుల పోలీసులు ప్రశ్నించారు. విచారణకు పిలిస్తే వెళ్లానని, పోలీసులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పానని అవినాష్ మీడియాకు తెలిపారు. అయితే, వివేకా కేసును స్థానిక సీఐ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
వివేకా మృతి తర్వాత సీఐతో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు, వివేకా గుండెపోటుతో చనిపోయారని తాను సీఐతో చెప్పినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అవినాష్ స్పష్టం చేశారు. గుండెపోటుతో చనిపోయారా అని సీఐ అడిగితే... రక్తపు మడుగులో పడివున్నారని మాత్రమే చెప్పానని వెల్లడించారు. కానీ, వివేకా గుండెపోటుతో చనిపోయారని నేనే చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం గురించి సీఐకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని ఆరోపించారు. ఈ విషయంలో సీఐ వ్యవహార సరళిపై ఆదివారం రాత్రి కడప జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడామని అవినాష్ రెడ్డి తెలిపారు.