t-congress: పార్టీ ప్రక్షాళన జరిగిన నాడే మళ్లీ గాంధీ భవన్ లో అడుగుపెడతా: సర్వే సత్యనారాయణ
- ఎన్ని అవాంతరాలు ఎదురైనా ‘కాంగ్రెస్’ ను వీడను
- ఎంపీ టికెట్ కోసం ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారు
- ఎంపీగా ఉత్తమ్ పోటీ చేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేస్తా
టీ-కాంగ్రెస్ లో ప్రక్షాళన జరిగిన నాడే తిరిగి గాంధీభవన్ లో అడుగుపెడతానని ఆ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగాల్సిన అవసరముందని, లేకపోతే, తీవ్ర నష్టం జరుగుతుందని, నాయకత్వ మార్పు జరగాలని అభిప్రాయపడ్డారు.
తనకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ‘కాంగ్రెస్’ ను వీడనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ పార్టీని వీడుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎంపీ టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఎంపీగా ఉత్తమ్ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థిగా టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వే సత్యనారాయణను రేవంత్ రెడ్డి కలిశారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా సర్వేను ఆయన కోరారు.