Reliance: గడువుకు ఒక్కరోజు ముందు స్పందించి పరువు దక్కించుకున్న అనిల్ అంబానీ
- ఎరిక్సన్ సంస్థకు రూ.462 కోట్లు చెల్లించిన ఆర్ కామ్
- మొత్తం రూ.571 కోట్లు చెల్లించాలన్న సుప్రీం
- అసలు రూ.550 కోట్లు, వడ్డీలు రూ.21 కోట్లు
రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్ కామ్ యజమాని అనిల్ అంబానీ పరువు దక్కించుకున్నాడు. స్వీడిష్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ ఎరిక్సన్ కు చెల్లించాల్సిన రూ.571 కోట్ల (అసలు రూ.550 కోట్లు+రూ.21 కోట్లు వడ్డీ) బకాయిల్లో భాగంగా సోమవారం రూ.462 కోట్లు చెల్లించాడు. ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో సుప్రీం కోర్టు మంగళవారం (మార్చి 19, 2019) వరకు గడువు విధించింది. లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అనిల్ అంబానీని హెచ్చరించింది.
గతనెలలో ఎరిక్సన్-ఆర్ కామ్ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు అనిల్ అంబానీకి నాలుగు వారాల గడువు విధించింది. ఆ లోగా 450 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ గడువు మంగళవారంతో పూర్తి కానుంది. గడువు లోపు చెల్లించకపోతే మూడు నెలలు జైలుశిక్ష తప్పదని స్పష్టం చేసింది. అయితే, ఒకరోజు ముందుగానే స్పందించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత గొప్ప విపత్తు నుంచి బయటపడ్డారు.
ఆర్ కామ్ నుంచి తమకు రూ.462 కోట్లు చెల్లింపులు జరిగినట్టు ఎరిక్సన్ ప్రతినిధులు ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా టెలికాం సేవల కోసం ఆర్ కామ్ సంస్థ ఎరిక్సన్ తో 2014లో ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, దీనికి సంబంధించిన బకాయిలు చెల్లించడం లేదంటూ ఎరిక్సన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.