Telangana: హిందువులపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు
- నిన్న కేసీఆర్ ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు..’అన్నారు
- రజత్ కుమార్ కు లిఖిత ఫిర్యాదు చేశాం
- చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాం: వీహెచ్పీ
నిన్న కరీంనగర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మండిపడుతోంది. హిందువులను అవమానపరిచేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ వీహెచ్పీ అధ్యక్షుడు రామరాజు, అధికార ప్రతినిధి రావి నూతల శశిధర్, రాష్ట్ర భజరంగ్ దళ్ కన్వీనర్ సుభాష్ చందర్ తదితరులు రజత్ కుమార్ ను ఈరోజు కలిశారు.
అనంతరం, మీడియాతో వారు మాట్లాడారు. ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. ఈ దిక్కుమాలిన దరిద్రుల చేతిలో పడి ఈ దేశం విలవిలలాడుతోంది’ అంటూ హిందువులపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. కాగా, లిఖిత పూర్వక ఫిర్యాదుతో పాటు కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన సీడీని రజత్ కుమార్ కు ఇచ్చినట్టు తెలిపారు.
అంతేకాకుండా, సుప్రీంకోర్టును కించపరిచేలా, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా కేసీఆర్ ప్రసంగించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ ను కోరినట్టు చెప్పారు.ఈ ఫిర్యాదుపై రజత్ కుమార్ స్పందించారని, ఈ విషయమై కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఆ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు.