Telugudesam: మాజీ ఎంపీ హర్షకుమార్కు చంద్రబాబు మొండిచేయి.. బాలకృష్ణ చిన్నల్లుడు, మురళీ మోహన్ కోడలికి దక్కిన టికెట్లు
- పదిమంది సిట్టింగ్ ఎంపీలకు దక్కిన టికెట్లు
- మురళీ మోహన్ కోడలికి రాజమండ్రి టికెట్
- వైజాగ్ నుంచి శ్రీభరత్
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్కు టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. అమలాపురం లోక్‌సభ స్థానానికి హర్షకుమార్ పేరును ప్రకటించే అవకాశం ఉందని గత రెండుమూడు రోజులుగా వార్తలు వినిపించాయి. ఈ మేరకు ఆయనతో టీడీపీ నేతలు చర్చలు కూడా జరిపినట్టు వార్తలు హల్చల్ చేశాయి.
అయితే, చివరి నిమిషంలో చంద్రబాబు తన మనసు మార్చుకున్నారు. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ మాధుర్‌వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో హర్షకుమార్ భవితవ్యం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దాదాపు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో హర్షకుమార్ అడుగులు ఎటువైపు పడతాయన్నది చూడాలి.
ఇక ముందుగా ఊహించినట్టే ఎంవీవీఎస్ మూర్తి మనవడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు విశాఖ, మురళీమోహన్ కోడలు రూపకు రాజమండ్రి సీట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీల్లో పదిమంది తిరిగి బరిలోకి దిగబోతున్నారు.