YS Viveka: 'బీ కేర్ ఫుల్' అంటూ వారం ముందే వైఎస్ వివేకా సెల్ కు అజ్ఞాత వ్యక్తి మెసేజ్!
- అజ్ఞాత వ్యక్తి ఎవరన్న విషయమై ఆరా
- గుండెపోటని తప్పుదారి పట్టించింది గంగిరెడ్డే
- హత్య కేసులో స్పీడ్ పెంచిన సిట్ అధికారులు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో వేగం పెంచిన సిట్ దర్యాఫ్తు బృందం పలు కొత్త విషయాలను కనుగొంది. హత్య జరగడానికి వారం రోజుల ముందే 'బీ కేర్ ఫుల్' అన్న మెసేజ్ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వివేకానందరెడ్డి సెల్ కు వచ్చిందని గుర్తించిన సిట్ అధికారులు, ఆ నంబర్ ఎవరిదన్న విషయంపైనా ఆరా తీస్తున్నారు. 10 రోజుల్లో ఓ సంచలనాన్ని చూస్తారని తన అనుచరులతో పరమేశ్వర్ చెప్పినట్టు తెలుసుకున్న పోలీసులు, అది వివేకా హత్యేనా? అన్న కోణంలో అతన్ని ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.
ఇక కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి కాల్ లిస్ట్ లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు కూడా ఉన్నాయని గుర్తించిన సిట్ అధికారులు, వారిని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయి. వివేకా గుండెపోటుతో మరణించారని మొట్టమొదట వ్యాఖ్యానించి మీడియాను, బంధువులను తప్పుదారి పట్టించింది కూడా గంగిరెడ్డేనని సిట్ అధికారులు భావిస్తున్నారు. గుండెనొప్పితో ఆయన మరణించారని వివేకా పీఏ కృష్ణారెడ్డి ద్వారా అవినాష్ రెడ్డికి చెప్పించారని, ఘటనాస్థలికి రాకుండా, మృతదేహాన్ని చూడకుండా కొందరు కుటుంబసభ్యులు అదే విషయాన్ని చెప్పారని సిట్ అధికారులు ధ్రువీకరించారు.