Kurnool District: ఓటేయడం వారికో పవిత్ర కార్యక్రమం... ఆ ఊర్లో అందరూ ఓటేస్తారు!
- కర్నూల్ జిల్లా జె.అగ్రహారం గ్రామం ప్రత్యేకత ఇది
- పోలింగ్ రోజు ఎక్కడ ఉన్నా కచ్చితంగా ఊరికి వస్తారు
- గత ఎన్నికల్లో గ్రామంలో నూటికి నూరు శాతం ఓట్లు
ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటును వంద శాతం వినియోగించుకుని ఆదర్శంగా నిలుస్తారు ఆ గ్రామ ప్రజలు. ఎన్నికల వేళ ఓటు వేయకుండా తప్పించుకునేందుకు ఎటువంటి సాకులు వెదకరు. కారణాలు చూపించరు. సమయానికి వచ్చి ఓటేయడం వారికో పవిత్ర కార్యక్రమం. ఎన్నికల రోజును సెలవుగా భావించే పట్టణ వాసుల బాధ్యతను గుర్తు చేస్తున్న ఈ గ్రామస్థుల తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జె.అగ్రహారం ఓ పల్లెటూరు. ఊరిలో ఉన్నది కేవలం 392 మంది ఓటర్లు. వృత్తి ఉద్యోగాలపై ఎక్కడ ఉన్నా పోలింగ్ రోజు కచ్చితంగా ఊరికి వస్తారు. ఓటు వేసి వెళ్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఓటింగ్ జరిగిన గ్రామం ఇది.
రెండు దశాబ్దాల క్రితం ఊరిని పట్టిపీడిస్తున్న సారా మహమ్మారికి వ్యతిరేకంగా జనవిజ్ఞాన వేదిక అండగా గ్రామ మహిళలంతా ఉద్యమాన్ని చేపట్టారు. సారా రక్కసిని ఊరి నుంచి తరిమి కొట్టారు. గ్రామంలోని మహిళలంతా అక్షరాస్యులయ్యారు. పొదుపు సంఘాల్లో చేరి చైతన్యవంతులయ్యారు. ఓటు ప్రాముఖ్యతపై తమలో తామే చర్చించుకుని అందరూ ఓటు వేసేలా స్వీయ చైతన్యాన్ని ప్రోది చేసుకున్నారు. ఎక్కడ ఉన్నా, ఎన్నిపనులున్నా ఊరికి వచ్చి ఓటేయాలని తీర్మానించుకున్నారు.