Kurnool District: టీడీపీ గూటికి బైరెడ్డి రాజశేఖరరెడ్డి... అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం!
- శ్రీశైలం నుంచి పోటీ చేయించే అవకాశం
- గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి
- మధ్యలో కొంతకాలం రాయల సీమ హక్కుల కోసం ఉద్యమం
కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, రాయలసీమ పరిరక్షణ సమితి ఉద్యమ కర్త బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి, ఈరోజు ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన బైరెడ్డి తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో పార్టీకి కూడా గుడ్‌బై చెప్పేసి ఉద్యమ నేత అవతారం ఎత్తారు. రాయలసీమ హక్కుల కోసం పోరాటం అంటూ ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పేరుతో సొంత కుంపటి పెట్టుకుని ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్య పరిచారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఆయనకు విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. తాజాగా టీడీపీలో చేరేందుకు మంతనాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని శ్రీశైలం స్థానం నుంచి పార్టీ టికెట్టు కేటాయించిన బుడ్డా రాజశేఖరరెడ్డి పోటీకి విముఖత చూపించడంతో సరైన అభ్యర్థి కోసం టీడీపీ వెతుకుతోంది.
ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బైరెడ్డి పార్టీలో చేరితే ఆయనను శ్రీశైలం స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.