Jana Sena: అన్న బాటలోనే తమ్ముడు...రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న పవన్‌కల్యాణ్
- ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చిన జన సేనాని
- ఎక్కడి నుంచి అన్నది పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడి
- గతంలో చిరంజీవి కూడా తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు పూర్తిగా తెరపడకున్నా కొంత క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు పవన్‌కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఏ స్థానాల నుంచి పోటీ చేయాలన్న విషయం పార్టీ కార్యవర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తారన్న ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ స్థానానికి పార్టీ అభ్యర్థిని ఎవరినీ ప్రకటించక పోవడం కూడా ఈ వాదనకు కొంత బలం చేకూర్చినట్టవుతోంది. తాజా నిర్ణయంతో మరో స్థానం ఏదన్న చర్చ సాగుతోంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. సొంత జిల్లాలోని పాలకొల్లుతో పాటు తిరుపతి నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. అయితే తిరుపతిలో గెలిచినా పాలకొల్లులో ఓడిపోయారు. పవన్‌కల్యాణ్ కూడా చిరంజీవి బాటనే ఎన్నుకున్నట్లు అయింది. అయితే ఆయన గాజువాకతోపాటు పాలకొల్లు నుంచి పోటీ చేస్తారా? లేక మరేవైనా రెండు నియోజకవర్గాలు ఎన్నుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.