AP: మెజార్టీ ఓట్లు తెప్పించిన నాయకులే నాకు సన్నిహితంగా ఉండగలుగుతారు: సీఎం చంద్రబాబు
- పార్టీ కోసం పని చేయని నేతలను పట్టించుకోను
- మా విజయ రహస్యం ‘పసుపు సైనికులే’
- టీడీపీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేస్తారా?
త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు సాధించిన నాయకులే తనకు సన్నిహితంగా ఉండగల్గుతారని ఏపీ సీఏం చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలులో జరిగిన టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం పని చేయని నేతలను పట్టించుకొనేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ విజయ రహస్యం 65 లక్షల మంది పసుపు సైనికులేనని, జెండాలు మోసి ఎన్నికలప్పుడు పార్టీని గెలిపించేది కార్యకర్తలేనని, నాయకులందరూ వారిని గౌరవించాలని అన్నారు.
పేదలు, రైతులు, యువత, మహిళలు అందరినీ ఆదుకుంటున్నామని, వారి కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని అన్నారు. ‘బీమా మిత్ర’ ద్వారా మృతి చెందిన వారి కుటుంబాన్ని ఆదుకుని, రూ.30 వేలు అందజేస్తున్నామని అన్నారు. ప్రజల కోసం ఇంతగా పాటుపడుతున్న టీడీపీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్, జగన్ పై ఆయన విమర్శలు చేశారు. ఏపీని ఈ ముగ్గురి నుంచి కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతోందని అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసమైన లోటస్ పాండ్ లో జగన్ ఉంటారు తప్ప, అమరావతి ప్రాంతాన్ని చూసేందుకు మాత్రం ఆయన ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. ఏపీకి న్యాయం చేయమని కోరినందుకు టీడీపీ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్న మోదీ, దొంగలకు కాపు కాస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.